హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, అర్హులైన వారి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీ నిరసనకు పిలుపునిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీ బాట పట్టింది.
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరిన ఈ ప్రత్యేక విమానంలో రాష్ట్ర మంత్రులతో పాటు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
పలువురు ఢిల్లీలోని అశోక హోటల్‌లో బస చేయనుండగా.. మరికొందరు తెలంగాణ భవన్, ఇతర ప్రాంతాల్లో ఉండనున్నారు. కాగా, గోవా టూర్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఆదివారం రాత్రికే నేరుగా ఢిల్లీకి చేరకున్నారు. అలాగే, మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.
కాంగ్రెస్ పోరాటం ఉధృతం
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. గత వారం కేవలం ఎంపీలతో కలిసి ఆందోళనలు చేసింది. జంతర్ మంతర్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఎంపీల లంచ్ మీటింగ్‌ల పేరుతో మెరుపు ధర్నాలు నిర్వహించింది.
అయితే, ఈ వారం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశలో రాష్ట్రాలను మమేకం చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయానికి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో ఉండాలని ఆదేశించింది. తొలి దశలో అధికారం ఉన్న రాష్ట్రాల్లో సీఎం, మంత్రులతోపాటు పీసీసీ చీఫ్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్‌లు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీలకు పిలుపునిచ్చింది.
